జనసేనాని కులనినాదం.. టీడీపీలో ఆందోళన!
జనసేనాని పవన్‌కల్యాణ్ పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల రాజకీయంలో ఆయన ఓ సత్యాన్ని గ్రహించినట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తన కులం (కాపు) అత్యంత శక్తిమంతమైందని ఆయన తెలుసుకున్నట్లు అర్థమవుతోంది. క్యాస్ట్ కార్డును నమ్ముకుంటే భవిష్యత్ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. పవన్ తీరు చూస్తుంటే తన పార్టీ లక్ష్యమైన కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయాలనే నిబంధనను గట్టు మీద పెట్టి, కుల నినాదాన్ని నెత్తికెత్తుకున్నట్లే స్పష్టమవుతోంది. ఇందుకు ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభను ఉదాహరణగా చెప్పొచ్చు.
కాపు కుల నినాదం తమపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయాందోళన తెలుగు దేశం పార్టీలో కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు వుంటుందనే సిగ్నల్స్ను పవన్ కల్యాణ్ పదేపదే పంపుతున్నారు. దీంతో కాపులు అంటే పెద్దగా గిట్టని కులాలు తమకు పొలిటికల్గా దూరం అవుతాయని టీడీపీ భయపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని.. మిగిలిన కులాలను కలుపుకుని పోవాలని పవన్ పిలుపు ఇవ్వడం బాగానే ఉంది.
సంబంధాలు అంతంతే!
ఏపీలో కాపు, బలిజతో పాటు వాటి అనుబంధ కులాలతో మిగిలిన సామాజిక వర్గాలకు అంత మంచి సంబంధాలు లేవన్నది కాదనలేని వాస్తవం. అందువల్లే పవన్ తన సామాజిక వర్గానికి ప్రత్యేకంగా అందరితో మంచిగా మాట్లాడాలని, కలుపుకుపోవాలని పిలుపు ఇవ్వడాన్ని పొలిటికల్ అనలిస్టులు గుర్తు చేస్తున్నారు. పలు కారణాల వల్ల కాపులతో క్షత్రియులు, బీసీలు, మైనార్టీలు, దళితులు మిగిలిన అణగారిన వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి.
పవన్ నాయకత్వాన్ని పైకులాలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో పవన్‌తో పొత్తు విషయమై చంద్రబాబు, లోకేశ్ తదితర ముఖ్య నాయకులు నోరు మెదపడం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. పాదయాత్రలో లోకేశ్ మాట్లాడుతూ.. జనసేనతో పొత్తు ఉందని ఎవరు చెప్పారంటూ క్వశ్చన్ చేశారు. ఫ్యూచర్లో పవన్తో పొత్తు పెట్టుకుంటే.. కాపులంతా తమకు సపోర్టుగా నిలిచే పరిస్థితి లేదని టీడీపీ నాయకుల అనుకుంటున్నట్లు సమాచారం.
పవన్కే ఓట్లు పడలే.. ఇంకా టీడీపీకి వేస్తారా?
గత ఎన్నికల్లో స్వయంగా పవన్‌కల్యాణ్కే కాపులు ఓట్లు వేయలేదని అందువల్లే ఆయన రెండు చోట్లా ఓడిపోయానరని టీడీపీ నేతలు అధిష్టానం వద్ద ప్రస్తావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పవన్‌కే అండగా నిలబడని కాపులు.. ఇప్పుడు ఆయన చెబితే టీడీపీకీ ఎలా ఓట్లు వేస్తారని రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు. పవన్‌తో పొత్తు పెట్టుకుంటామనే ప్రచారం వల్ల ఇప్పటికే బీసీల్లో 75 శాతం మంది సీఎం వైఎస్ జగన్‌కు సానుకూలంగా మారారనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో, నాయకుల్లో కనిపిస్తోందని అంటున్నారు.