రైతు కొడుకు బిలియనీర్ అయ్యాడు.. అసలు ఎవరీ రవి పిళ్లై?
‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. శ్రమను నమ్ముకుని పైకొచ్చిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు ‘రవి పిళ్లై’. పేదరికంతో పోరాడుతున్న అన్నదాత కుటుంబంలో జన్మించిన రవి పిళ్లై.. ఈ రోజు కేరళలో మాత్రమే కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్‌లోని అత్యంత సంపన్నులైన భారతీయుల్లో ఒకరుగా ఉన్నారు. కేరళ కొల్లాం తీరప్రాంత పట్టణానికి చెందిన ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రవి పిళ్లై.. కష్టాలు ఎన్ని ఎదురైనా చదువులో మాత్రం అస్సలు రాజీపడలేదు.
Must Read: ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?
చదువుకోవాలనే తపన కలిగిన పిళ్లై బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత చిట్ ఫండ్ కంపెనీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, అతి తక్కువ కాలంలో భారీగా నష్టాలపాలయ్యారు. అనంతరం 150 మందితో కన్‌స్ట్రక్షన్ సంస్థను ప్రారంభించారు. దీంతో క్రమంగా ఆయన ఎదుగుదల మొదలైంది. ఈ రోజు ఈ కంపెనీలో ఏకంగా 70 వేల కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం.
గెలుపు మంత్రం అదే..!
ప్రస్తుతం రవి పిళ్లైకి ‘ది రావిజ్ అష్టముడి’, ‘ది రవీజ్ కోవలం’, ‘ది రవీజ్ కడవు’ లాంటి 5 స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఆయనకు వరల్డ్లోని వివిధ ప్రాంతాల్లో అనేక గృహాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి పూణేలోని ట్రంప్ టవర్ లగ్జరీ కాండో అని చెబుతుంటారు. కొల్లాంలో ఆర్పీ మాల్, 300 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని పిళ్లై కలిగి ఉన్నారు. నిరంతర కృషి, పట్టుదలతో ఈస్థాయికి ఎదిగిన రవి పిళ్లైకి భారత ప్రభుత్వం 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్, 2010లో పద్మశ్రీ పురస్కారాలను అందించింది.
అనేక వ్యాపారాల్లో సక్సెస్
పేదరికంతో పోరాడుతున్న రైతు కొడుకుగా పుట్టిన రవి పిళ్లై.. ఆర్పీ గ్రూప్ సామ్రాజ్యాన్ని నిలబెట్టారు. ఆయన ఆస్తి దాదాపుగా 7.8 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారుగా రూ. 64 వేల కోట్ల కంటే ఎక్కువ. లగ్జరీ హోటల్స్ మాత్రమే కాదు.. స్టీల్, గ్యాస్, ఆయిల్, సిమెంట్, షాపింగ్ మాల్స్ లాంటి బిజినెస్ల్లోనూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు రవి పిళ్లై.
ఎన్నెన్నో లగ్జరీ కార్లు సొంతం
సుమారు రూ.100 కోట్ల ఖరీదైన ఎయిర్‌బస్ హెచ్145 హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయుడు పిళ్లై కావడం విశేషం. ఆయన దగ్గర ఆధునిక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెజ్ మేబాచ్ ఎస్ 600, బీఎండబ్ల్యూ 520 డీ, ఆడీ ఏ6 మ్యాట్రిక్స్, మెర్సిడెజ్-మేబాచ్ ఎస్ 500, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ లాంటి పెద్ద కార్లు కూడా ఉన్నాయి.