విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు భారీ నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్లాంట్ కాపాడతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిన్ భవనం వద్ద జరిగిన నిరసనలో కార్మిక నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగుల జీతాలకు ఉత్పత్తికి సంబంధం లేదని, ఆ సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడమే నష్టాలకు కారణమని, దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్లకు గనులు ఉంటే విశాఖకు మాత్రం లేవని గుర్తు చేశారు. ప్రైవేటీకరణ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

