హైదరాబాద్‌లో ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, నకిలీ వర్క్ ఆర్డర్లతో బడా వ్యాపారవేత్తలను నమ్మించి వందల కోట్లు వసూలు చేసింది. తాజాగా సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్టైన మహిళ పేరు సంధ్యారాణి. పెద్దగా చదువు లేకపోయినా, తెలివితేటలతో వ్యాపారవేత్తలను బురిడీ కొట్టింది. దాదాపు 40 వరకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసింది. అనంతరం వ్యాపారవేత్తల నుంచి పెట్టుబడుల పేరుతో సుమారు రూ.500 కోట్ల వరకు వసూలు చేసి, ఆ డబ్బులను 1800కి పైగా మ్యూల్ అకౌంట్ల ద్వారా తన ఖాతాల్లోకి మళ్లించుకుంది. ఈ మోసంలో సంధ్యారాణికి భర్త శ్రీధర్, తమ్ముడు ఎమర్తి రామ్‌దాస్ సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. ఒక పారిశ్రామికవేత్త ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.