ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని, అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి మద్దతుగా నిలబడటం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హక్కులు దక్కడం లేదని పేర్కొంటూ, కేంద్రాన్ని అభ్యర్థించడం కాదు… అవసరమైతే మద్దతు ఉపసంహరించుకుని పోరాటానికి దిగాలని ఆమె డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తాత్సారం చేస్తోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం ఎంతో అవసరమని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం మాటలు తప్ప, చేతల్లో మాత్రం సహకారం చూపడం లేదని విమర్శించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అప్పులు పెరిగిపోతున్నాయని, అయినా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో విడుదల కావడం లేదని షర్మిల అన్నారు. పోలవరం ప్రాజెక్టు వంటి కీలక జాతీయ ప్రాజెక్టులకు కూడా సరైన నిధులు ఇవ్వకపోవడం ఏపీపై జరుగుతున్న వివక్షకు నిదర్శనమని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని ప్రశ్నించకుండా, మద్దతుగా నిలబడటం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు.

