వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణపతికి తొలి పూజలో పాల్గొని ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగన్ షెడ్యూల్ ప్రకారం ఉదయం విజయవాడ రాణిగారితోటలోని వినాయక మండపంలో పూజలకు హాజరయ్యేలా ప్రణాళిక వేసినా, కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులోనే పూజా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నాయకుడు దేవినేని అవినాష్ సహా పలువురు నాయకులు గణపతి ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా నాయకులు గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.