కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీసీల పేరుతో చేస్తున్న ఈ ఆందోళన అసలు ముస్లింల రిజర్వేషన్ల కోసం మాత్రమేనని ఆయన ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీల కోసం కాదని, అది పూర్తిగా ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు కల్పించాలనే కుట్రలో భాగమని అన్నారు. బీసీలకు 5 శాతం పెంపు, ముస్లింలకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలనే కాంగ్రెస్ యోచన వాస్తవానికి బీసీ ముసుగులో ముస్లింలకు శాతం వంద రిజర్వేషన్ల అమలుకే దారితీస్తుందని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు లేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. బీసీలకు నిజంగా మేలు చేయాలనుకుంటే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఒక్క బీసీని కూడా ప్రధాని చేయలేదని, 48 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా చూడలేదని ప్రశ్నించారు. కేబినెట్ పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఎంపీ సీట్లు—ఇవన్నీ ఎంతమేర బీసీలకు ఇచ్చారో ప్రజల ముందే చెప్పాలని సవాలు విసిరారు. బీసీలను ప్రధాని స్థాయికి చేర్చిన ఘనత మాత్రం భాజపాదేనని, ఇప్పటి వరకు 27 మంది బీసీలకు కేంద్ర మంత్రి పదవులు, అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రుల బాధ్యతలు ఇచ్చింది కూడా తమ పార్టీనేనని బండి సంజయ్ గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీకి తెలంగాణలో కూడా చివరికి యూపీ, బెంగాల్, బిహార్లలో లాగానే శూన్యమవడం తప్పదని హెచ్చరించారు.