ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం అధికారులు కొత్త మార్గదర్శకాలు అమలు చేయనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని స్పష్టంచేశారు. సంప్రదాయ వేషధారణ లేకపోతే ఆలయ ప్రవేశం నిరాకరించబడుతుందని తెలిపారు. ఇకపై ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్ల వాడకం పూర్తిగా నిషేధించబడింది. అంతరాలయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ఘటనలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తమ ఫోన్లను ఆలయ ఆఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు, సిబ్బందితో సహా అందరూ సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని, ఆలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు. అలాగే స్కానింగ్ పాయింట్లు, టికెట్ కౌంటర్ల వద్ద కఠిన తనిఖీలు జరగనున్నాయి. డ్రెస్ కోడ్ పాటించని వారు లేదా సెల్‌ఫోన్లతో వచ్చే వారికి ఇకపై ఆలయంలో ప్రవేశం ఉండదని స్పష్టంచేశారు.