తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ మరోసారి ప్రారంభమైంది. సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టగా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకొని కేసు వివరాలను సమీక్షించనున్నారు. ఆయన తిరుపతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించనున్నట్లు సమాచారం.
గతంలో పరకామణిలో చోరీ ఆరోపణలపై జీయంగార్ గుమస్తా రవికుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. నిందితుడి కుటుంబం టీటీడీకి రూ. 40 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసు గతంలో లోక్ అదాలత్‌లో రాజీకి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, తాజాగా సీఐడీ డీజీ స్వయంగా విచారణ చేపట్టడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారిందని అధికార వర్గాలు తెలిపాయి.