అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్తాన్ సంస్థ కార్యకర్తలు పాకిస్తాన్‌లో విస్తృత నిరసనలు చేపట్టారు. గురువారం నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళనలు శుక్రవారం హింసాత్మక రూపం దాల్చాయి. పంజాబ్ ప్రాంతంలో పోలీసులు టీఎల్పీపై తీవ్ర చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పార్టీ చీఫ్ సాద్ రిజ్వి మాట్లాడుతూ, పోలీసులు తమ 11 మంది కార్యకర్తలను కాల్చి చంపారని, మరో 24 మందికి పైగా గాయపరిచారని ఆరోపించారు. నిరసనలు ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి వంటి ప్రధాన నగరాల్లో విస్తరించాయి. శుక్రవారం టీఎల్పీ కార్యకర్తలు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించారు. దీనిని అడ్డుకోవడానికి భద్రతా బలగాలు జోక్యం చేసుకున్నప్పుడు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఆందోళనలు తీవ్రతరమైన కారణంగా పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్థంభన పాలయ్యాయి. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా ఆపేశారు. ఇస్లామాబాద్ మరియు రావల్పిండిలో లాక్‌డౌన్‌ను విధించి, భద్రతా చర్యలు పెంచారు అధికారులు. టీఎల్పీ నాయకుడు సాద్ రిజ్వి పోలీసుల చర్యలను ఉద్దేశపూర్వకమని, శాంతియుత నిరసనలను హింసాత్మకంగా అణచివేస్తున్నారని ఆరోపించారు. “ఎవరి సూచనలతో మా కార్యకర్తలపై కాల్పులు జరుపుతున్నారు?” అంటూ పోలీసులను ప్రశ్నించారు. తన నివాసంపై దాడి చేసి, తల్లి, భార్య, పిల్లలను అరెస్టు చేశారని మండిపడ్డారు. గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రులకు తీసుకెళ్లినా వైద్యులు చికిత్స అందించడానికి నిరాకరించారని కూడా ఆరోపించారు.
ఈ సంఘటనలు పాకిస్తాన్‌లో రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. భారత్, అఫ్ఘానిస్తాన్‌తో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు బలోపేతం చేస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.