కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత చెలరేగింది. స్వతంత్ర అభ్యర్థి సురేష్ రెడ్డిపై కొందరు టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన ప్రాంతంలో కలకలం రేపింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడటంతో, ప్రస్తుతం పులివెందులలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేష్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలు కూడా దాడికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులో టీడీపీ తెలుగు యువత జిల్లా కార్యదర్శి విజయ్‌కుమార్ రెడ్డి, మా భాష, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, భాస్కర్, సంజీవ్, ఖాసీం, రహంతుల్లా, శివ, ధనుంజయ, ప్రశాంత్, శీను, రవి, మల్లికార్జున, అనిల్ తదితరులు సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇక మరోవైపు, ఎన్నికల సమయంలో అశాంతి నెలకొనే అవకాశం ఉందని భావించిన పోలీసులు వైసీపీ శ్రేణులపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. పులివెందుల పరిధిలోని 160 మందికి పైగా వైసీపీ నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఎర్రబల్లి, నల్లపురెడ్డిపల్లి, తుమ్మలపల్లి, కొత్తపల్లి, రాయలాపురం, అచ్చువెల్లి, నల్లగొండవారిపల్లి, మోటు, నూతలపల్లి, కణంపల్లి గ్రామాలకు చెందిన నాయకుల పేర్లు ఇందులో ఉన్నాయి. మరికొందరిపై కూడా త్వరలో కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురికి పోలీస్‌స్టేషన్‌కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల వల్ల పులివెందులలో ఎన్నికల వేళ హైటెన్షన్ పరిస్థితి కొనసాగుతోంది.