- ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ భారీ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏ 40 నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకరించారు. 2024 జూన్‌లోనే ఈ భారీ మొత్తాన్ని దాచినట్టు సిట్ విచారణలో తేలింది. శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్ హౌస్‌లో సిట్టింగ్ గదుల క్రింద ప్రత్యేకంగా నిర్మించిన ప్రదేశంలో ఈ డబ్బు పెట్టెలను దాచినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఫార్మ్‌హౌస్ సులోచన ఫార్మ్స్ పేరిట, ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. డబ్బు దాచడంలో ఆయన పాత్రపై కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిట్ దాడుల సమయంలో కొంతమంది పత్రాలు, లావాదేవీల వివరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ లావాదేవీల వెనుక ఉన్న రాజకీయ, వ్యాపార సంబంధాలను వెలికితీయడంలో సిట్ కీలకంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కాం కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, తాజాగా స్వాధీనం చేసిన రూ.11 కోట్లకు సంబంధించి డబ్బు మూలాలు, దానిని ఎక్కడ వినియోగించాలనుకున్నారనే అంశాలపై విచారిస్తున్నారు. త్వరలోనే కొంతమందిని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. సిట్ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఏపీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు రూ.3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయి. యూపీ డిస్టిలరీ సహా 16 డిస్టిలరీల నుంచి ముడుపులు ₹1,677.68 కోట్లు వసూలు చేసినట్టు తేలింది. రాజ్‌కెసిరెడ్డి బినామీ సంస్థగా యూవీ డిస్టిలరీస్‌ను గుర్తించారు. ఈ డిస్టిలరీల ద్వారా జరిగిన డీల్స్‌లో హైదరాబాద్ అరేట్ హాస్పిటల్ డైరెక్టర్లు తీగల ఉపేందర్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి పేర్లు వెలుగులోకి వచ్చాయి.