జమ్మూ–కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు దాడులు మరింత ముమ్మరం చేస్తున్నాయి. ఇటీవల పహల్గాం దాడి అనంతరం సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్ సంయుక్తంగా వరుస ఆపరేషన్లకు దిగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కుల్గాం జిల్లా ఆఖల్ ప్రాంతంలో “ఆపరేషన్ అఖల్” పేరుతో భారీ ఎన్‌కౌంటర్ చేపట్టాయి. అధికారుల సమాచారం ప్రకారం, రాత్రంతా కొనసాగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఇంకా కొందరు ఉగ్రవాదులు అక్కడే చిక్కుకుని ఉన్నారని, వారిని మట్టుబెట్టే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం స్పష్టం చేసింది. స్థానికంగా సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు ప్రత్యేక దళాలు కలసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గత వారం పహల్గాం దాడికి సంబంధించిన ఆపరేషన్ మహదేవ్‌లో మూడు కీలక ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. వారిని మట్టుబెట్టిన కొద్ది రోజులకే మరోసారి భద్రతా దళాలు కుల్గాంలో ఉగ్రవాదులను శిక్షించేందుకు ముందడుగు వేయడం విశేషం.