దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా ఎంపికైన దాదాపు 61 వేల మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు పొందిన యువతను అభినందించిన ప్రధాని మోదీ, “ఈ రోజు మీ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ నియామక పత్రం కేవలం ఉద్యోగంలో చేరేందుకు ఇచ్చే పత్రం మాత్రమే కాదు. ఇది దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మీకు ఇచ్చే ఆహ్వానం” అని అన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు యువత తమ బాధ్యతను గుర్తించాలన్నారు. దేశ పురోగతిని వేగవంతం చేయడంలో మీ పాత్ర కీలకమని యువతకు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న సంకల్పం ప్రభుత్వానిదే కాకుండా ప్రతి యువకుడి, యువతి బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. ఉద్యోగం అంటే కేవలం వ్యక్తిగత లాభం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే అవకాశం కూడా అని అన్నారు. మీరు పనిచేసే ప్రతి కార్యాలయం, ప్రతి విభాగం దేశ ప్రగతిలో భాగమేనని చెప్పారు. నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణతో పని చేస్తే దేశం మరింత ముందుకు వెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

