ఖమ్మం జిల్లాలో ఒక విస్మయకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడితో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ మహిళపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సాధారణంగా బాలికలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు నిందితులపై పోక్సో కేసులు నమోదు చేస్తుంటారు. కానీ ఈసారి ఓ మహిళే మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకోవడంతో కేసు నమోదవడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఆ మహిళ గతంలో తన భర్తతో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత అదే ప్రాంతంలో ఉన్న 17 ఏళ్ల బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి ఇద్దరూ సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ మహిళ, బాలుడిని తనతో తీసుకుని వెళ్లిపోయింది. ఇక విషయం తెలిసిన వెంటనే బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని పోలీసులకు వివరించి, ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.