పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగాలని కోరుతున్నవారిపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీ నేతలు పథకపూర్వకంగా రాష్ట్రాన్ని అలజడులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘ఇల్లు అలకగానే పండగ కాదు. రేపు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీకు ఏ ఖర్మ వస్తుందో మీరే ఊహించుకోండి,’’ అంటూ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నాని.. వయసు పెరిగేకొద్దీ చంద్రబాబులోని తక్షణ ఆలోచనల తీరూ, రాజకీయ నైజం మరింత రుగ్మత చెందుతోందన్నారు.
ఉపఎన్నికపై వైసీపీ ఆరోపణలు:
పులివెందుల ఉపఎన్నికను ప్రత్యేకంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన తీరు ఏదో కుట్రకు సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము నామినేషన్ వేసాం. అదే మొదలు పెట్టి రౌడీలను తరలించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాము వంటి బీసీ నేతలపై హింసాత్మక దాడులు చేశారు. కార్లను ధ్వంసం చేశారు. కత్తులు, రాడ్లతో పైశాచికంగా దాడి చేయించారు,’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల వెనుక ముందస్తు పథకం ఉందని, పోలీసులకు ముందే సమాచారం ఉన్నప్పటికీ వ్యవహరించిన తీరును ఆయన ప్రశ్నించారు. ‘‘ఇది స్పష్టమైన రాజకీయ కుట్ర. చంద్రబాబు ఇప్పుడు గూండా రాజకీయాన్ని నెరవేర్చేలా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఒకటంటే ఒకటైనా కేసు లేని వాళ్లపై బైండోవర్లు పెడుతున్నారు’’ అని విమర్శించారు.
ఈసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్
ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం గమనించి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పే చర్యలు తీసుకోవాలని పేర్ని నాని కోరారు. ‘‘భయభ్రాంతులకు గురిచేసి గెలిచామని చెప్పుకోవద్దు. ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాలన్నదే మా కోరిక,’’ అని పేర్కొన్నారు.