ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెఫ్టిస్ట్, రైటిస్ట్ భావజాలాలకు అతీతంగా సమతుల్య ఆలోచనలు ముఖ్యమని పేర్కొన్నారు. “నేను రచయితను కాదు, కానీ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. మానసిక పరిపక్వత కోసం పుస్తకాలు చదవడం అవసరం” అని సూచించారు. పవన్ కల్యాణ్ తన భారతీయ ఆలోచనా విధానాన్ని గుర్తు చేస్తూ, ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకంలోని మాలతి పాత్రలో ధైర్యం, మేధస్సు, సాహసాలు స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ పుస్తకం భారతీయ స్వాతంత్ర్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. భారతదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉందని, అందుకే మహిళలకు ఎప్పటి నుంచో ఉన్నత స్థానం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. “నేను దుర్గాదేవిని పూజిస్తాను. ప్రతి మహిళలో దుర్గాదేవిని చూస్తాను” అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. జనసేన మహిళా విభాగానికి ‘ఝాన్సీ వీరమహిళ’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. తన తల్లి, వదినల పెంపకంలో పెరిగానని, తల్లి వంటగది నుంచే ప్రపంచాన్ని చూసిందని గుర్తు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, త్వరలో అవి అమలులోకి రానున్నాయని స్పష్టం చేశారు. మహిళలకు భారత సంస్కృతిలో ఉన్న గౌరవం, వారి సాహసాలను గుర్తించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సాహిత్య, సాంస్కృతిక చర్చలకు వేదికగా నిలిచింది.