భారత్-రష్యా సంబంధాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-రష్యా మధ్య ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుందని, అవి బలంగా కొనసాగుతున్నాయని షరీఫ్ తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా రష్యాతో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది ప్రాంతీయ అభివృద్ధి, శాంతి మరియు శ్రేయస్సుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. పుతిన్ ఒక శక్తివంతమైన నాయకుడని అభివర్ణించిన షరీఫ్, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పరాజయానికి 80 ఏళ్ల సందర్భంగా చైనాలో నిర్వహించిన మిలిటరీ పరేడ్‌లో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. పుతిన్ వరసగా పలు నేతలతో సమావేశమవగా, ముందురోజు ఎస్‌సీఓ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కూడా భేటీ అయ్యారు. మోడీ, పుతిన్ సమావేశం అంతర్జాతీయంగా ప్రధాన చర్చగా నిలిచింది. ఎస్‌సీవో సమావేశం ముగిసిన అనంతరం మోడీ భౄరత్‌కు తిరుగుప్రయాణం అయ్యారు. పుతిన్ చైనా పర్యటన కొనసాగింది.