జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ జరిపి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం పహల్గాం దాడిలో కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారు. అయితే వీరికి సహాయం చేసిన స్థానికులకు కేవలం రూ.3,000 మాత్రమే ఇచ్చారని దర్యాప్తులో తేలింది. ఈ సహకారం ఇచ్చిన ఇద్దరు స్థానికులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డిజిటల్ ఆధారాలు స్పష్టంగా ఉగ్రవాదుల కుట్రను బయటపెట్టాయని అధికారులు తెలిపారు. ఈ దాడి అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిందని వారు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌లు, పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్లలో భద్రతా లోపాలను గుర్తించి, భయాన్ని వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల ఉద్దేశమని అధికారులు చెప్పారు. పహల్గాం దాడి వెనుక ప్రముఖ ఉగ్రవాది హషీం ముసా పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. లోయలో అతను చురుకైన ఉగ్రవాద ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, ఈ కుట్రలో అతని ప్రమేయం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని వెల్లడించింది. స్థానికుల మద్దతు లేకుండా ఇలాంటి పెద్ద దాడి జరగడం అసాధ్యం అని అధికారులు స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాలపై ఉగ్రవాదుల దృష్టి ఉండటం భద్రతా వ్యవస్థ మరింత కఠినతరం కావాల్సిన అవసరాన్ని రుజువు చేస్తోంది.