ప్రకృతి ఆగ్రహం ముందు మనిషి ఎంత బలహీనుడో మరోసారి స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఘటన మరువకముందే, ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో ప్రకృతి విధ్వంసకరరూపం ప్రదర్శించింది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా మట్టికరిపించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలో నివసించిన వందలాది కుటుంబాలు కొండచరియల కింద ఇరుక్కుపోయి మృతి చెందగా, ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. కొండచరియల కారణంగా గ్రామం పూర్తిగా నేలమట్టమైపోయింది. అక్కడ మట్టిలో పూడుకుపోయిన శవాలను వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్థానికంగా పరిస్థితిని పరిశీలిస్తున్న సూడాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు, “గ్రామం ఇప్పుడు శవాల గుట్టగా మారిపోయింది” అని హృదయ విదారకంగా తెలిపారు. ఈ విపత్తుకు కారణం ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే అని అధికారులు చెబుతున్నారు. నిరంతర వర్షపాతం వల్ల పర్వతాల నుంచి మట్టిపెళ్ళలు కూలిపడి మొత్తం గ్రామాన్ని కప్పేశాయి. ఈ ప్రాంతం డార్ఫర్‌లోకి వస్తుంది, ప్రస్తుతం సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఆధీనంలో ఉంది. వేలాది మంది మరణించడంతో స్థానికంగా ఆందోళన వ్యాపించగా, అంతర్జాతీయ సహాయం అవసరమని ఆ సంఘం నేత అబ్దేల్‌వాహిద్ మొహమ్మద్ నూర్ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేశారు. శవాలను వెలికితీసి మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరపడం, జీవించి ఉన్న వారికి సహాయం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఒకే గ్రామం పూర్తిగా జీవం లేని శ్మశానంగా మారిపోవడం ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రకృతి ముందు మనిషి సృష్టి ఎంత చిన్నదో మరోసారి ఈ విపత్తు గుర్తుచేసింది.