2023లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఆయన పర్యటన సెప్టెంబర్ రెండవ వారంలో ఉండే అవకాశముందని సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని ఇంఫాల్‌తో పాటు హింసకు తీవ్రంగా గురైన చురాచంద్‌పూర్ జిల్లాను కూడా సందర్శించి, నిరాశ్రయ శిబిరాల్లో ఉన్న ప్రజలను కలిసే అవకాశం ఉంది. ప్రధాని పర్యటనలో భాగంగా అనేక కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు, కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పర్యటన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో గట్టి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. శాంతి వాతావరణం కొనసాగేందుకు కేంద్రం నుంచి కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
250కి పైగా మృతి, వేలాది నిరాశ్రయులు
2023 మేలో మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై కుకి కమ్యూనిటీ నిరసన చేపట్టగా, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ హింసలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 60 వేల మంది ప్రజలు ఇళ్లను విడిచి సహాయ శిబిరాల్లో నివసించాల్సి వచ్చింది. పరిస్థితి అదుపులోకి రావడానికి కేంద్రం పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించింది. తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించగా, ఆగస్టులో దీనిని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. రాష్ట్రపతి పాలన విధించడం ఆలస్యం చేశారని, ఇది ప్రజాస్వామ్య సూత్రాల ఉల్లంఘన అని కాంగ్రెస్ పార్టీ విమర్శించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఇది అవసరమని స్పష్టం చేసింది.
మోడీ శాంతి సంకేతం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్‌పై పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం 21 నెలల గందరగోళం తర్వాత ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా మణిపూర్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటనతో శాంతి ప్రక్రియ మరింత బలపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరాశ్రయ శిబిరాల్లో ఉన్న ప్రజలను కలవడం, వారికి భరోసా ఇవ్వడం ద్వారా మోడీ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.