ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంను గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, రాష్ట్రంలోకి వస్తున్న 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం విశాఖకే వస్తున్నాయని ఆయన తెలిపారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో పని చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడమే కాకుండా దాని నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 3 వేల కోట్ల సహాయం అందించిందని లోకేష్ వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పాటు ఈ నిధులు స్టీల్ ప్లాంట్‌కు ఊతమిచ్చాయని, ఇప్పటికే మూడు బ్లాస్ట్ ఫర్నేసులను ఆపరేషన్‌లోకి తెచ్చామని తెలిపారు. విశాఖపట్నం ఆర్థిక శక్తి కేంద్రంగా (ఎకనామిక్ పవర్ హౌస్) మారనుందని, ఈ లక్ష్య సాధనకు కేబినెట్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని లోకేష్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టినప్పటికీ, విశాఖ కేవలం 10 ఏళ్లలో ఆ స్థాయిని అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐటీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు. విశాఖను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చకుండా పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.