పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్ సమీపంలోని శోభాపుర్‌లో ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బాలేశ్వర్ జిల్లాకు చెందిన ఈ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు దుండగులు వారిని వెంబడించి, బెదిరించి సమీపంలోని అడవిలోకి ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితురాలిని బెదిరించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన బాధితురాలిని స్థానికులు గమనించి సమీప ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న బాధితురాలి తల్లిదండ్రులు శనివారం ఉదయం దుర్గాపుర్ చేరుకొని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి స్నేహితుడు కూడా ఈ నేరంలో పాల్గొని, ఆమెను తప్పుదారి పట్టించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అతడు ఆమె ఫోన్, డబ్బును కూడా లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి, నిందితులతోపాటు ఇతరులను విచారిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎక్స్‌లో తెలిపారు. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.