ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.మాచవరంలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, గతంలో కర్ర పట్టుకుని వచ్చినవారు రేపు గొడ్డలితో వస్తారన్నారు. టీడీపీ నేతల వేధింపులతో ఊరులు వదిలి వెళ్లినవారు తిరిగి వస్తారని హెచ్చరించారు. మీరు గ్రామం దాటించారని, రేపు రాష్ట్రం దాటే పరిస్థితి వస్తుందని కాసు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తెగిస్తే టీడీపీ తట్టుకోలేరని, వీధి వీధిలో పరుగులు తీయాల్సి వస్తుందని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని, గతంలోనూ అందరికీ చోటు కల్పించామని తెలిపారు.
చంద్రబాబు గతంలో సైతం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రుణమాఫీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రస్తుత హామీలు కూడా సాధ్యం కానివేనని వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీ నేతలపై కూటమి నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.