ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్, జమ్మూకాశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టం చేశారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ చర్చలో ఆయన పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ సైనిక ఆక్రమణ, అణచివేత, వనరుల దోపిడీని ఖండిస్తూ, జమ్మూకాశ్మీర్ ప్రజలు తమ హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. భారతదేశం వసుదైక కుటుంబం సిద్ధాంతానికి కట్టుబడి, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తుందని, అందరికీ న్యాయం, గౌరవం, శ్రేయస్సు కల్పించాలని కోరుకుంటుందని వివరించారు.

