వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో హాజరయ్యారు. గన్నవరం నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి కోర్టు వరకు దారంతా “జై జగన్” నినాదాలతో ప్రతిధ్వనించింది. భారీ ర్యాలీగా మారిన ఈ ఊరేగింపు నాంపల్లి సీబీఐ కోర్టు వరకు కొనసాగింది. కోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితమైన సమయానికి చేరుకున్న జగన్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కోర్టు హాల్‌లో ఉన్నారు. హాజరును రికార్డు చేసిన కోర్టు విచారణను ముగించింది. “ప్రస్తుతం మళ్లీ హాజరు కావాల్సిన అవసరం లేదు. తదుపరి కోర్టు ఉత్తర్వుల ప్రకారమే జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు” అని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. కోర్టు పనులు ముగిసిన తర్వాత జగన్ బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ నివాసానికి బయలుదేరారు. కోర్టు నుంచి ఇంటి వరకు రోడ్డు పొడవునా వేలాది మంది అభిమానులు ఆయనను కలవడానికి ఎగబడ్డారు.

