వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పిన మాటలకు విరుద్ధంగా రాష్ట్ర ఆర్థికం కుదేలైందని ఆరోపించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలోని గణాంకాలను ఆధారంగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతాలో ఆదివారం పోస్టు చేసిన జగన్, కొసరంత ఆదాయం, ఇసుమంత మూలధన వ్యయం, కొండలా పెరిగిన రుణభారమే చంద్రబాబు విజన్ అని ఎద్దేవా చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆదాయ వృద్ధిని నిరాశాజనకంగా చూపుతున్నాయి. సొంత పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 7.03 శాతం మాత్రమే నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోల్చితే జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు 2.85 శాతం మాత్రమే పెరిగాయి. 2023–24 నుంచి 2025–26 వరకు రెండేళ్లలో సొంత పన్నుల ఆదాయాల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 2.75 శాతంగా ఉంది. టీడీపీ కూటమి 2024–25లో జీఎస్‌డీపీ వృద్ధి 12.02 శాతం సాధించామని, 2025–26లో 17.1 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. అయితే ఈ లక్ష్యాలకు అనుగుణంగా పన్ను ఆదాయాలు 12–15 శాతం పెరగాల్సి ఉండగా, వాస్తవం కేవలం 2.75 శాతం మాత్రమే.
మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు గత రెండేళ్లలో 16 శాతం తగ్గింది. 2025–26 తొలి త్రైమాసికంలో సొంత పన్నుల ఆదాయ వృద్ధి 3.47 శాతం మాత్రమే. గతేడాదితో పోల్చితే జీఎస్టీ, అమ్మకపు పన్ను ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు మాత్రం తొలి త్రైమాసికంలో జీఎస్‌డీపీ వృద్ధి 10.50 శాతం అధికమని చెబుతున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని జగన్ ఆరోపించారు. గత ఐదేళ్లలో (2019–24) రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వార్షిక వృద్ధి 9.87 శాతం కాగా, రూ.58,031 కోట్ల నుంచి రూ.92,922 కోట్లకు చేరింది. జీఎస్‌డీపీ వార్షిక వృద్ధి 10.23 శాతం నమోదైంది. టీడీపీ కూటమి హయాంలో ఈ రెండూ తక్కువగా ఉన్నాయి. అయినా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రం దూసుకుపోతున్నది అప్పుల్లోనే అని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.2,06,959 కోట్ల అప్పులు చేశారని తేల్చారు.

