గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులకు తక్షణ చికిత్స అందించేందుకు భారత్‌లో తొలిసారిగా ‘పశు ఫస్ట్ ఎయిడ్ కిట్’ అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్ వల్లభ్‌పంత్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జవహర్‌లాల్ సింగ్ ఈ సృజనాత్మక కిట్‌ను రూపొందించారు. 72 రకాల ఔషధాలు, అవసరమైన పరికరాలతో కూడిన ఈ కిట్‌ను జబల్‌పుర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ సైన్స్ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సదస్సులో ప్రొఫెసర్ సింగ్ ప్రదర్శించారు. మారుమూల ప్రాంతాల్లో పశువులు అనారోగ్యంతో లేదా పాము కాటుకు గురైనప్పుడు సత్వర చికిత్స అందడం కష్టమని, అలాంటి సందర్భాల్లో ఈ కిట్ అత్యంత ఉపయోగకరమని ప్రొఫెసర్ జవహర్‌లాల్ సింగ్ తెలిపారు. ఈ కిట్ ధర రూ.3,000గా నిర్ణయించగా, దీన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి మధ్యప్రదేశ్ పశుగణాభివృద్ధి శాఖ మంత్రికి ఈ కిట్‌ను అందజేశారు. ఈ ఆవిష్కరణ పశు సంరక్షణలో కొత్త అధ్యాయాన్ని తెరవనుంది.