కేరళకు చెందిన బీజేపీ ఎంపీ, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ తాను కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఆదివారం జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తాను సినీ కెరీర్‌ను వదులుకొని మంత్రి పదవిని కోరలేదని స్పష్టం చేశారు. ఇటీవల తన ఆదాయం గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్న సురేశ్ గోపీ, మళ్లీ సినిమాల్లో నటించాలనే తన ఆసక్తిని వ్యక్తం చేశారు. తన మంత్రి పదవిని కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు సదానందన్ మాస్టర్‌కు అప్పగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన కేరళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.