జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ ఈ నెల 11న జరగనుండగా, మంగళవారం 97 మంది ఓటర్లు ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. ఈ ఉప ఎన్నికలకు హోం ఓటింగ్ కోసం 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4 మరియు 6 తేదీల్లో రెండు దశల్లో హోం ఓటింగ్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం భారీ పోలీసు భద్రత మధ్య 97 మంది ఇంటి వద్దే ఓటు వేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ బూత్ లాంటి ఏర్పాట్లు చేశారు. సాయుధ బలగాలను మోహరించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి సహా ప్రిసైడింగ్ అధికారులు పర్యవేక్షించారు. మిగిలినవారు 6వ తేదీన హోం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఒకే రోజు 97 మంది హోం ఓటింగ్ చేయడం ఇదే మొదటిసారి. దరఖాస్తు చేసుకున్న 80 ఏళ్లు పైబడిన ఇద్దరు సీనియర్ సిటిజన్లు ఓటింగ్‌కు ముందే మృతి చెందారు. వారం క్రితం వారు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

