Thursday, October 30, 2025

ఏపీలో మోంథా తుఫాన్ విధ్వంసం

Must Read

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల‌ను మోంథా తుఫాన్ హ‌డ‌లెత్తించింది. నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్య తీవ్ర తుపాను దాటింది. దీంతో సముద్రం అల్లకల్లోలమైంది. ప్రస్తుతం రెండు మీటర్ల ఎత్తు అలలు ఎగసిపడుతున్నాయి.తుపాను కాస్త బలహీనపడి మచిలీపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భీకర గాలులు, భారీ వర్షాలు సమస్యలు సృష్టించాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. వృక్షాలు నేలకూలాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో 20 గంటలుగా విద్యుత్ సరఫరా లేదు. సెల్ టవర్లు దెబ్బతినడంతో మొబైల్ సేవలు పనిచేయడం లేదు. పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మత్స్యకారులు ఐదు రోజులుగా సముద్రానికి వెళ్లలేకపోతున్నారు. పలు జిల్లాల్లో ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం తుపానుగా మారింది. ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అవుతుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయి.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. తెలంగాణలోనూ మోంథా ప్రభావం కనిపిస్తోంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్. భద్రాద్రి, ఖమ్మం, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్, జనగాం, గద్వాల, మేడ్చల్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్ర‌క‌టించారు. దివి సీమలో ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అవనిగడ్డ నియోజకవర్గంలో గాలుల కారణంగా విద్యుత్ పునరుద్ధరణకు అడ్డంకులు. గాలులు తగ్గిన తర్వాత సరఫరా పునరుద్ధరిస్తారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు. బుధవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. పూడూరులో 6.1 సెంటీమీటర్లు, మోమిన్‌పేటలో 6 సెంటీమీటర్లు, ధారూరులో 4.6 సెంటీమీటర్లు, పరిగిలో 4.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. కిరండోల్ రైల్వే లైన్ ధ్వంసమైంది. వాల్తేరు డివిజన్‌లో కొత్తవలస-కిరండోల్ సింగిల్ లైన్ పాడైంది. అరకు టన్నెల్ నంబర్ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య ట్రాక్ పూర్తిగా నాశనమైంది. మట్టి, బండరాళ్లు చేరాయి. వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారీ వర్షం. ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారి నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ కాకాని నగర్‌లో మూడు రేకు షెడ్లు పడిపోయాయి. చెట్లు ఇళ్లపై కూలాయి. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. రెండు ఇళ్లు పాక్షికంగా నాశనం. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం. నల్లమలలో భారీ వర్షానికి భవనాసి వాగు పొంగింది. వక్కిలేరు, భవనాసి వాగులు ఉప్పొంగాయి. ఆత్మకూరు శివార్లలో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పట్టణం జలదిగ్బంధం. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై మోకాళ్లు ఎత్తు నీరు. వెలుగోడు మండలం మాధవరంలో గాలేరు వాగు పొంగి 8 గ్రామాలకు సంబంధాలు తెగాయి. లోతట్టు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు నిద్రాహారాలు మానేసి కష్టాలు పడుతున్నారు.

విశాఖపట్నంలో తుపాను ప్రభావం కొనసాగుతోంది. నిన్న రాత్రి భారీ ఈదురుగాలులు. శంకరమఠం రోడ్‌లో ఇంటిపై భారీ వృక్షం కూలింది. ప్రమాదం తప్పింది. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఫైర్ సిబ్బంది చెట్టు తొలగిస్తున్నారు. జోన్ 3లో 72 చెట్లు పడ్డాయి. అధికారులు తొలగించారు. విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం. గుంటూరులో బలమైన ఈదురుగాలులతో వర్షం. నగర రహదారులు జలమయం. పొంగిపొర్లుతున్న డ్రైన్లు. బ్రాడీపేట, అరండల్‌పేట, మహిళా కాలేజ్, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం రోడ్లు నీట మునిగాయి. ఆర్‌యూబీ, మూడో వంతెన కింద భారీ నీరుచేరింది. కోనసీమ జిల్లా అంతర్వేది పాలెం వద్ద తీరం దాటింది. 70 నుంచి 80 కిలోమీటర్ల గాలులు. భారీగా చెట్లు కూలాయి. విద్యుత్ లైన్లు ధ్వంసమైనాయి. రోడ్లపై వృక్షాలు అడ్డంగా పడి రాకపోకలు నిలిచాయి. చిరుజల్లులు కురుస్తున్నాయి. 50 వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. కొబ్బరి చెట్లు పెద్ద సంఖ్యలో కూలాయి. తీరంలో ఈదురుగాలులు. అంతర్వేది, ఉప్పలంగుప్తం ఓడరేవుల్లో సముద్రం అల్లకల్లోలం. అలలు ఎగసిపడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం. పలుచోట్ల విద్యుత్ నిలిపివేత. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఆర్టీసీ బస్టాండ్ సబ్‌వేలో నీరు. పోలీసులు బారికేడ్లు పెట్టారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌కు వాహనాలు నిషేధం. ప్రకాశం బ్యారేజ్‌కు వరద పెరుగుతోంది. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 82,675 క్యూసెక్కులు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు విడుదల నిలిపివేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 22 సెంటీమీటర్లు. బలమైన గాలులతో వర్షం. విద్యుత్ స్థంభాలు, చెట్లు పడ్డాయి. జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.మచిలీపట్నంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసం. సరఫరా నిలిచింది. నెల్లూరు, బోగూరులో గుడిసెలు కూలాయి. ప్రజలు భయపడ్డారు. ప్రకాశంలో 10 అడుగుల అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది.పలు జిల్లాల్లో విద్యుత్ అంతరాయం. రోడ్లు జలమయం. కోనసీమలో సముద్రం ఉప్పొంగింది. సఖినేటిపల్లి అంతర్వేదిలో సముద్రం ముందుకు వచ్చింది. మామిడికుదురు కరవాక, గొగన్నమఠంలో ముందుకు రావడంతో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ శాఖ 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మోస్తరు వర్షాలు కొనసాగుతాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత...
- Advertisement -

More Articles Like This

- Advertisement -