రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదం మఖచ్కల తూర్పు శివార్లలోని ఖానావ్యూర్ట్ జిల్లాలోని సులేవ్‌కెంట్ గ్రామం సమీపంలో జరిగింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉన్నవారు భయంతో ప్రాణాల కోసం పరుగులు తీశారు. పేలుడు ధాటికి గ్యాస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైపోగా, సమీపంలోని కేఫ్టీరియాలకూ మంటలు వ్యాపించాయి. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, పేలుడు సంభవించిన సమయంలో చెవులు మూసుకుపోయేంతటి పెద్ద శబ్దం వినిపించిందని, వెంటనే ఆకాశంలో నల్లటి పొగ ముసురుకుపోయిందని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఇంధనం నింపే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు, దట్టమైన నల్లటి పొగ దూరం నుంచే కనిపించాయి. రష్యాలోని ఈ ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.