భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దేవస్థానాల నిధుల వినియోగం, వీఐపీల దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేదికగా మాట్లాడుతూ ఆయన, “ప్రపంచంలో హిందువులకు తిరుమల ఒక స్ఫూర్తి కేంద్రం. భక్తులు సమర్పించే కానుకలు పూర్తిగా ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తుల సౌకర్యాలకే వినియోగించాలి. దేవస్థాన నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు లేదా ఇతరత్రాలకు వాడటం సరికాదు” అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని కోరిన వెంకయ్య నాయుడు, “ప్రతి ఊరిలో గుడి ఉండాలి. బడి కట్టడం ప్రభుత్వ బాధ్యత అయితే, గుడి కట్టడం దేవస్థానాల బాధ్యత. టీటీడీ దీనిపై ముందుకు రావాలి” అని సూచించారు. వీఐపీల దర్శనాలపై కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ, “ప్రజాప్రతినిధులు, వీఐపీలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దర్శనానికి రావాలి. వారి కుటుంబ సభ్యులను పరిమితంగా తీసుకురావాలి. ఇలా చేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగదు” అని తెలిపారు.