చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం రాజకీయాలలో వేడి పెరుగుతోంది. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా, గాలి భాను ప్రకాష్ గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. ప్రజలకు ఆయన కన్పించకుండా పోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మాట్లాడుతూ.. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరి ప్రాంతం ద్వారా చెన్నైకి ఇసుక తరలింపు జరుగుతోందని ఆరోపించారు. ఈ రవాణాలో ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందని ఆరోపిస్తూ, అదే విషయాన్ని వైసీపీ కౌన్సిలర్లపై నకిలీ ఆరోపణలు మోపుతున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాలో అరెస్టయిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను దుర్మార్గంగా టార్గెట్ చేశారని విమర్శించారు. పోలీసులకు సుప్రీం కోర్టు, హైకోర్టు వ్యాఖ్యలు కూడా తెలియవా? అని ప్రశ్నించారు. వాస్తవంగా ఎమ్మెల్యే అనుచరులే ఇసుక దందా చేస్తుంటే, దానికి సంబంధం లేని తమ పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం తప్పుడు ప్రయోజనాల కోసం అవమానకరమని అన్నారు.మూడు జిల్లాలు దాటి ఇసుక అక్రమ రవాణా జరిగేంతవరకు అధికారులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్ ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఊరుకుంటారా? అంటూ వ్యాఖ్యానించారు.