వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకుంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారంటే, వేలాది మంది కార్మికుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చేదని ఆయన ఎద్దేవా చేశారు. పేర్ని నాని మాట్లాడుతూ, “ఆ సమయంలో అర్జీలు తీసుకోవటానికి విశాఖకు వెళ్ళానని చెబుతున్నారు, మరి ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదు? కనీసం విజయవాడలోనైనా అర్జీలు సేకరించలేరా?” అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఏ పని అయినా చేస్తారని మండిపడ్డారు.
మోడీ, అమిత్ షాతో చనువుంటే సమస్యలెందుకు తీర్చరు?
పవన్ నోవాటెల్ హోటల్‌కు వెళ్లడం వెనుక కారణం ఏమిటని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రధానికి ఫోన్ చేస్తానని, అమిత్ షాను “అమిత్ భాయ్” అని పిలిచేంత సాన్నిహిత్యం ఉందని చెప్పే పవన్ కళ్యాణ్, నిజంగా ఆ పరిచయాన్ని ప్రజల కోసం ఉపయోగించలేరా అని నిలదీశారు. “విశాఖ ఉక్కు ప్లాంట్‌కి ఒక మైన్ అలాట్ చేయమని మోడీ, అమిత్ షాను అడగలేరా? 42 విభాగాల ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయించే ధైర్యం మీకు లేదా?” అని ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఇంతటి ఎరువుల సమస్య ఏనాడూ రాలేదని, యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఇప్పుడు వచ్చిందని వ్యాఖ్యానించారు. “మోడీ, అమిత్ షాలకు ఫోన్ చేసి యూరియా అందించమని అడగలేరా? మీటింగుల్లో ఉపన్యాసాలు ఇచ్చే బదులు మీ నియోజకవర్గంలో రైతుల బాధలు తీరుస్తే మేలు” అని అన్నారు.
పవన్ రాజకీయ వైఖరిపై విమర్శలు
న్యూట్రలిస్ట్, లెఫ్టిస్ట్, రైటిస్ట్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూనివర్సలిస్ట్‌గా మారిపోయారని పేర్ని నాని విమర్శించారు. దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. “జనసేన కార్యకర్తలకు సర్దుకోవాలని చెబుతున్న పవన్ కళ్యాణ్, నిజంగా మీరు సర్దుకున్నారా? మీ అన్నను ఎమ్మెల్సీ చేసి రేపు మంత్రిని చేయబోతున్నారనే వాదన వస్తోంది” అని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్, దుర్గేష్‌లకు మంత్రి పదవులు ఇవ్వకుండానే సర్దుకోవచ్చుకదా అని నిలదీశారు. ఎక్కడికెళ్లినా జెండాలు మోపించడం తప్ప అసలు సర్దుకోవడం మీకు రాదని పేర్ని నాని విమర్శించారు. చివరగా, “మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో ఒక్కసారి ప్రజల ముందే చర్చించుకుందాం” అంటూ పవన్ కళ్యాణ్‌ను సవాల్ విసిరారు.