ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కని, దానిని కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను స్థాపించి, ప్రతి కాలేజీతో పాటు ఆసుపత్రి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని, అయినప్పటికీ ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు. ప్రైవేటు సంస్థలు ప్రజలను దోపిడీ చేయడానికే చూస్తాయని, రాష్ట్ర ప్రజలు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సర్వే నిర్వహిస్తే ఈ వాస్తవం తేలుతుందని సవాల్ విసిరారు. విద్య, ఆరోగ్యం ప్రజలకు అత్యవసరమని, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా అప్పులపాలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా నాశనమై, వైద్య ఖర్చులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగారుస్తోందని ఆయన ఆరోపించారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం లక్షలు ఖర్చు చేసిన విద్యార్థులు, వైద్యులైన తర్వాత ప్రజల నుంచి డబ్బు గుంజడానికే ఆసక్తి చూపిస్తారని ఆయన విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో బాధపడే వారిని రాజకీయ పార్టీలు వాడుకున్నాయని, వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచినీటి సౌకర్యం, కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని నెలకొల్పినట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లైనా గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులో లేవని, వీటిని ప్రైవేటీకరిస్తే తాము ఊరుకోబోమని, పోరాటం చేస్తామని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయని, చనిపోయిన వారికి కూడా వైద్యం పేరిట బిల్లులు వసూలు చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.