మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన కొందరు వ్యక్తులు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు కవాల్ టైగర్ రిజర్వ్‌లోని ఇందన్ పల్లి అటవీ రేంజ్ పరిధిలోని కవాల్ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ ప్రాంతంలోని పాలగోరీల ప్రాంతంలో అటవీ భూమిని ఆక్రమించేందుకు గుడిసెలు కట్టడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించాలని ఆక్రమణదారులకు సూచించారు. అయితే, అటవీ సిబ్బందిపై కోపం తెచ్చుకున్న ఆక్రమణదారులు కారం చల్లుతూ, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో అటవీ సెక్షన్ అధికారి రాజేందర్, బీట్ అధికారి సంతోష్ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాలకు తరలించారు. ఈ ఘటనపై అటవీ అధికారులు జన్నారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, అటవీ అధికారులు కలసి అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం ఆక్రమణదారులపై కేసులు నమోదు చేశారు. గత రెండు, మూడు రోజులుగా గ్రామ పెద్దలు, సంఘ పెద్దల సహాయంతో ఆక్రమణదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి, అటవీ భూమి ఆక్రమించవద్దని హెచ్చరించామని, అయినా కూడా వారు పట్టించుకోకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనతో కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.