ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలని వచ్చిన సంస్థలను స్వాగతిస్తామని, అయితే వాటి నుంచి రాష్ట్రానికి లభించే ప్రయోజనాలపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఇటీవల జరిగిన మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ పై స్పందిస్తూ ఆయన పలు విమర్శలు గుప్పించారు. డేటా సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించడం లేదని, గూగుల్ పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమ స్వప్రమోషన్ చేసుకుంటున్నారని సెటైర్ వేశారు. డేటా సెంటర్‌తో పాటు డెవలప్‌మెంట్ సెంటర్ కూడా స్థాపించాలని గూగుల్ నుంచి హామీ తీసుకోవాలని అమర్నాథ్ సూచించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, యువతకు లభించే ఉద్యోగ అవకాశాలు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రైడెన్ ఇన్ఫో టెక్ ప్రాజెక్టు వల్ల కేవలం 200 మందికి మాత్రమే ఉపాధి లభిస్తుందని చెప్పారు. 2023లో అదానీ డేటా సెంటర్‌కు భూములు కేటాయించినప్పుడు, ఐటీ టవర్లు నిర్మించి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలని నిబంధనలు విధించామని ఆయన గుర్తుచేశారు. విద్యుత్ టారిఫ్ మినహాయింపులు ప్రతీ నెలా వెయ్యి కోట్ల రూపాయలు అవుతాయని, ఉద్యోగాలు, రెవెన్యూ లేకుండా 22 వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉంటుందో సీఎం చంద్రబాబు వివరించాలని డిమాండ్ చేశారు. గూగుల్ డేటా సెంటర్‌కు గంటకు అవసరమైన విద్యుత్ సరఫరా వల్ల విద్యుత్ గ్రిడ్‌పై పడే ఒత్తిడిని ప్రభుత్వం అధ్యయనం చేసిందా అని ప్రశ్నించారు. కేబినెట్ మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రభుత్వ ఆర్డర్ (జీవో)లో 200 ఉద్యోగాలు వస్తాయని రాసి ఉంటే, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని చెప్పడం సరికాదని, చిన్నప్పుడు చందమామ కథలు వినేవాళ్లం.. ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వచ్చిందని సెటైర్ వేశారు అమర్నాథ్. తాను ఐటీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ విషయాలు చెబుతున్నానని, మేము లేవనెత్తిన సమస్యలు సహేతుకం కాదని ఎవరైనా చెప్పగలరా అని సవాల్ విసిరారు.