ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది శనివారం వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారనుంది. సోమవారం నాటికి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అని నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కాకినాడ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

