ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. తొలి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున 2,342.92 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అదనంగా కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 చొప్పున 831.51 కోట్ల రూపాయలను రైతులకు అందించనుంది. ఈ విధంగా ప్రతి రైతు ఖాతాలో తొలి విడతలోనే రూ.7,000 చేరనున్నాయి. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ అమలులో భాగంగా ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయబోతున్నారు. ఈ సహాయం మూడుదఫాలుగా అందజేయనుంది ప్రభుత్వం.