రాష్ట్రంలో ప్రజాస్వామ్యం యథేచ్ఛగా నాశనం అవుతోందని, రైతుల సమస్యలకు పరిష్కారం చూపే దిక్కు లేదని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పులివెందుల పర్యటనలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వాగ్దానాలతో మోసం చేస్తోందని, “సూపర్ సిక్స్” పేరుతో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతోందని ఆరోపించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాలు పోలీసుల సహకారంతో ఓటర్లను బెదిరించారని జగన్ ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల ఉదాహరణను గుర్తు చేస్తూ, “అప్పుడు టీడీపీ గెలిచినా తర్వాత కొట్టుకుపోయింది. దేవుడు అన్యాయం చూసి తగిన తీర్పు ఇస్తాడు” అని హెచ్చరించారు. అంబకపల్లెలో కృష్ణా జలాలు చేరిన సందర్భంగా అక్కడి చెరువుకు హారతి ఇచ్చిన జగన్ మాట్లాడుతూ, పార్టీ శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇడుపులపాయ నుంచి అంబకపల్లె వరకు 47 కిమీ ప్రయాణానికి గ్రామాలన్నీ ఆయనకు స్వాగతం పలకగా, ఆ ప్రయాణం 6 గంటలు కొనసాగింది.