కరూర్‌లో టీవీకే ప్రచార సభలో తొక్కిసలాట ఘటనపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టింది. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం రాత్రి కరూర్ చేరుకుంది. ఏఎస్పీ ముఖేశ్ కుమార్ డీఎస్పీ రామకృష్ణన్ సహా ఆరుగురు సభ్యుల బృందం శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని టూరిజం గెస్ట్ హౌస్ ను కేంద్రంగా చేసుకుని సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోంది. సిట్ దర్యాప్తు చేసిన దస్త్రాలు సీబీఐకి అప్పగించారు. అధికారులు దస్త్రాలను పరిశీలిస్తున్నారు. రానున్న రోజుల్లో తొక్కిసలాట ఘటన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. బాధిత కుటుంబాలు ప్రత్యక్ష సాక్షులు స్థానికుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేపట్టింది. టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై నమ్మకం లేదని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. విచారించిన జస్టిస్ మహేశ్వరి జస్టిస్ అంజారియా ధర్మాసనం సీబీఐకి మారుస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది.