కాంగ్రెస్ మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారాల కోసం మంత్రి పొంగులేటి ఐటీసీ కోహినూర్ లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సైతం అదానీ భజన చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటల పాటు సమావేశం జరిగిందని.. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి. బయటకు మాత్రం మోడీ అదానీ భక్తుడంటూ దొంగ మాటలు మాట్లాడారని పేర్కొన్నారు. ప్రధాని కోసం దామగుండం, అదానీ కోసం రామన్నపేటను రేవంత్ రెడ్డి అప్పగించాడని ఆరోపించారు. మధ్యలో మూసీని మేఘా కృష్ణా రెడ్డికి ఇచ్చాడని తెలిపారు. త్వరలోనే వాళ్ల బట్టలు విప్పి, నగ్నంగా నిలబెడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డికి అనుచరులుగా మారారని, రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది తల ఊపి, ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులకు బడ్జెట్లు పెడుతున్నారని ఆరోపించారు. రేపు రేవంత్ రెడ్డి ఉద్యోగం ఊడినప్పుడు.. మీ ఉద్యోగాలు కూడా ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు.. కొడంగల్ – నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి పంచుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి, అదే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మూసీలో కలుపుతామంటున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామాలు ఆపి, అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు.