తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను జీవితంలో ఇకపై సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడి మేధావులు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నియోజకవర్గంతో రాజకీయంగా ఇక సంబంధం పెట్టుకోనని తేల్చిచెప్పారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన కోసం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి ప్రచారం చేశారని గుర్తు చేశారు. తనను గెలిపించాలని రాహుల్ గాంధీ బహిరంగంగా కోరినప్పటికీ, ఇక్కడ తనను ఓడించారన్నారు. ఇది తనకు తీవ్ర మనస్తాపం కలిగించిందని, రాహుల్ గాంధీని అవమానించినట్లుగా ఫీల్ అయ్యానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఇది మరిచిపోలేని సంఘటనగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. తన ఓటమికి కారణం పేద ప్రజలు కాదని, సంగారెడ్డిలోని మేధావులు, కొందరు పెద్దలేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే కారణంతో ఇకపై సంగారెడ్డి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. భవిష్యత్తులో తన భార్య నిర్మల సంగారెడ్డి నుంచి పోటీ చేసినా తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం పార్టీ కోసం ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు.

