మణిపూర్‌లో శాంతి స్థాపనకు దోహదపడే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన సాయుధ గ్రూపులు కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (కేఎన్‌వో), యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (యూపీఎఫ్) కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వంతో కలిసి కార్యకలాపాల నిలిపివేత ఒప్పందంపై సంతకం చేశాయి. ఢిల్లీలో గురువారం ముగిసిన చర్చల అనంతరం కుదిరిన ఈ త్రైపాక్షిక ఒప్పందం ఏడాది పాటు అమలులో ఉండనుంది. మణిపూర్ భౌగోళిక సమగ్రతకు ఎటువంటి భంగం కలగదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. కేఎన్‌వోలోని 13 వర్గాలు, యూపీఎఫ్‌లోని 7 వర్గాలు తమ కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని క్యాంపులను ఇతర ప్రాంతాలకు తరలించాలి, మొత్తంగా క్యాంపుల సంఖ్యను తగ్గించాలి. ఆయుధాలను బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ శిబిరాల్లో జమ చేయాలి. గ్రూపుల్లో విదేశీయులు ఉంటే గుర్తించేందుకు భద్రతా బలగాలకు సహకరించాలి. ఒప్పందం అమలు, ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఉమ్మడి పర్యవేక్షణ బృందం ఏర్పాటైంది. అత్యవసర వస్తువుల రవాణా సులభతరం చేయడానికి మణిపూర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి2ను తెరవాలని కుకీ జో కౌన్సిల్ (కేజెడ్‌సీ) నిర్ణయించింది. వాహనాల రాకపోకలకు భద్రతా బలగాలతో పూర్తి సహకారం అందిస్తామని కూడా కేజెడ్‌సీ హామీ ఇచ్చింది. ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనకు ముందు కుదిరిన ఈ ఒప్పందం రాష్ట్రంలో శాంతి వాతావరణానికి దోహదపడే సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.