హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహించింది. నగరంలోని పలుచోట్ల కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా చట్టప్రకారం వ్యవహరించడం లేదని పేర్కొంది. ‘శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని ఉంది? సెలవుల్లో నోటీసులు ఇచ్చి, కూల్చేస్తారా? శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలియదా?’ అని ప్రశ్నించింది. చట్ట ప్రకారం నడుచుకోకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన రూల్స్ కు విరుద్ధంగా పనిచేస్తారా? ఇల్లు కూల్చే ముందు ఆ ఇంటి ఓనర్ కు చివరి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులు పెడతారా? ’ అని ఫైర్ అయింది. ఇంటి యజమానులు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాసిన అవసరం ఏముంది? రాజకీయ పెద్దలను, ఉన్నతాధికారుల మెప్పు కోసం చట్ట విరుద్ధంగా పనిచేస్తారా? చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు? అలాంటిది యజమానికి చివరి అవకాశం ఇవ్వకుండా ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఇదే రకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త’ అని హెచ్చరించింది.