ఆఫీస్‌లో కాఫీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే!
పొద్దున లేస్తే కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. కాఫీ తాగందే తమ రోజు మొదలవ్వదని అనేవాళ్లూ ఎంతోమంది ఉన్నారు. ‘కాస్త కాఫీనీళ్లు మొహాన కొట్టు’ అనే డైలాగ్‌ను తెలుగు సినిమాల్లో వినే ఉంటారు. కాఫీ తాగడం ఆలస్యమైతే దాదాపుగా అందరి ఇళ్లలో ఇవే డైలాగులు వినబడతాయి. కాఫీకి ఉండే రుచి, అది ఇచ్చే కిక్ అలాంటిది మరి. ఇల్లు అనే కాదు బయటకు వెళ్లినా, ఆఫీసుకు వెళ్లినా కాఫీ మస్టు అనే వాళ్లూ ఉన్నారు. అక్కడా ఇక్కడా అనే తేడాల్లేకుండా రిఫ్రెష్మెంట్ కోసం ఎక్కడ కాఫీ దొరికినా తాగేస్తుంటారు.
వర్క్ ప్లేసులో కాస్త బ్రేక్ దొరికినా కాఫీతో రిలాక్స్ అవుతారు కొందరు. ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే కాఫీ తాగితే.. బ్రేక్ తర్వాత పనిలో స్పీడ్ పెంచొచ్చు. అయితే ఇలా ఆఫీసుల్లో తరచుగా కాఫీ తాగేవారిలో మీరూ ఉన్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే! అవునండీ.. ఆఫీసుల్లో కాఫీ తాగే వారు ప్రమాదంలో ఉన్నట్లేనని స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ హెచ్చరిస్తోంది. లివర్‌పూల్‌కు చెందిన ఈ టీమ్ చాలా ఆఫీసుల్లోని కిచెన్లను సందర్శించింది. వీళ్ల పరిశోధనల్లో తేలింది ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి.
తాగారా.. రిస్క్ తప్పదట!
ఆఫీసుల్లోని కిచెన్స్‌లో శుభ్రతా ప్రమాణాలను అస్సలు పాటించరని ఈ రీసెర్చ్ టీమ్ వెల్లడించింది. అక్కడి కాఫీ మిషన్లు, కాఫీ ప్లాస్కుల్లో బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పేరుకుపోతున్నాయని తెలిపింది. ఇలాంటి కాఫీని తాగేవారికి రిస్క్ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. చాలా ఆఫీసుల్లోని కిచెన్ల్లోని మైక్రోవేవ్స్, కాఫీ మెషీన్స్, ప్లాస్కులు, కెటిల్స్‌ను అస్సలు శుభ్రంగా ఉంచట్లేదని రీసెర్చ్ టీమ్ తమ రిపోర్టులో పేర్కొంది. పలు ఆఫీసుల్లోని క్యాంటీన్లలోని మైక్రోవేవ్స్ బటన్స్, కాఫీ మెషీన్ల బటన్ల మీద ఈ కోలిని కనుగొన్నామని.. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పింది. సుడోమోనస్ అనే మరో బ్యాక్టీరియాను కూడా ఫ్రిడ్జ్, కాఫీ మెషీన్ల డోర్ల మీద కనిపెట్టామని.. దీని వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది.