ఆ మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌కు హాయ్ చెప్పినట్లే!
ఆరోగ్యం కోసం చాలా మంది వ్యాయామం చేస్తుంటారు, ఏవేవో డైట్స్ పాటిస్తుంటారు. వ్యాయామం చేయడంలో తప్పు లేదు కానీ డైట్స్ పేరుతో పండ్లు, కాయగూరలను పక్కనపెట్టి కడుపు మార్చుకోవడం సరికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందితేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని చెబుతున్నారు. అందుకే అలాంటి పోషకాల కోసం వివిధ రకాల ఆహార పదార్థాలు తినాలని సూచిస్తున్నారు.
అదే సమయంలో చికెన్, మటన్ లాంటివి పరిమితంగా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం మితంగా తినాలని అంటున్నారు. ముఖ్యంగా రెడ్ మీట్ వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. మాంసాహారం తింటే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసం వినియోగం మితిమీరితే వివిధ ఆరోగ్య సమస్యలు తప్పవని పరిశోధనలు కూడా ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో రెడ్ మీట్ వాడకం ఎక్కువైతే ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్‌ను హెల్త్ ఎక్స్ పర్ట్స్ వివరించారు. అవేంటో తెలుసుకుందాం..
ఎముకల ఆరోగ్యంపై ఎఫెక్ట్
ఎముకల ఆరోగ్యానికి మాంసాహారం సహకరిస్తుందనేది తెలిసిందే. ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలంటే రెడ్ మీట్ తినాల్సిందే. అయితే మటన్ ఎక్కువగా తింటే బోన్స్‌పై దుష్ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే దీంట్లో చెడు కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ చెడు కొవ్వు రక్తంలో కొవ్వు శాతాన్ని బాగా పెంచుతుంది. దీని వల్ల అది గుండె నాళాలను దెబ్బతీస్తుందని న్యూట్రిషన్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. దీంతో గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఎముకల ఆరోగ్యం పైనా ఇది ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
ఆ మీట్ తిన్నా సమస్యలే!
యానిమల్ మీట్ ఎక్కువగా తినే వారి రక్తంలో ఆమ్లత్వం బాగా పెరుగుతుంట. దీనివల్ల కొన్ని రకాల పోషకాలను శరీరం సంగ్రహించలేదట. అలాగే ఎసిడిక్ బ్లడ్ వల్ల ఎముకల మీద ప్రభావం పడి, అవి బలహీనంగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రక్తంలో ఆమ్లత్వం పెరిగితే.. అది ఎముకల నుంచి కాల్షియం తొలగిపోయేందుకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఎముకలు ధృడంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అని న్యూట్రిషన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. జంతువుల నుంచి లభించే హై ప్రోటీన్ కారణంగా ఎముకలు కాల్షియంను కోల్పోయే డేంజర్ ఉంది. దీంతో మాంసం ఉపయోగం పెరిగితే, ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. దీంట్లో ఫాస్పరస్-కాల్షియం నిష్పత్తి ఎక్కువగా ఉంటుందట. ఇది ఎముకల్లో కాల్షియం కోల్పోయే స్థితిని అధికం చేస్తుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఫలితంగా మినరల్ రహితంగా ఎముకలు మారతాయట.
ప్రత్యామ్నాయం ఏంటి..?
మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వివిధ రూపాల్లోని ప్రొటీన్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాల లాంటి డెయిరీ పదార్థాలు, చేపలు, చికెన్, ప్రొటీన్ అధికంగా ఉండే మొక్కలను డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు పండ్లు, కాయగూరలు, తృణ ధాన్యాలతో సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. బీన్స్, పప్పులు, ఆకుకూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్స్‌పై అవగాహన పెంచుకోవడం మంచిదని చెబుతున్నారు.