కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా?.. అయితే ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు!
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. బయటికి వెళ్లినప్పుడు అందరికంటే తామే అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. అందుకే బ్యూటీ టిప్స్ పాటిస్తూ అందంగా కనిపిస్తారు. అయితే ముఖంతో పాటు కళ్లను కూడా అందంగా ఉంచుకోవాలి. కంటి అందాన్ని కాపాడుకుంటే మరింత అందంగా కనిపించొచ్చు. కొందరైతే రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతూ.. ఫోన్, ల్యాప్టాప్ లాంటివి చూస్తూ కంటి అందాన్ని పాడు చేసుకుంటారు. అలాంటి వారిలో ఎక్కువగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడాన్ని చూడొచ్చు. వారి కోసమే ఈ ఇంటి చిట్కాలు..
దోసకాయలు
దోసకాయ ముక్కలను కాస్త సన్నగా కోయాలి. వాటిని 10 నుంచి 12 నిమిషాల పాటు కళ్ల మీద ఉంచాలి. కళ్లపై.. అలాగే డార్క్ సర్కిల్స్, వలయాల మీద సున్నితంగా రుద్దాలి. దోసకాయ ముక్కల్ని అలాసే కాసేపు ఉంచి రిలాక్స్ అవ్వాలి. అలాగే బంగాళదుంప ముక్కలతోనూ ఇలాగే చేయొచ్చు.
బాదం నూనెతో మర్దన
బాదం నూనె కూడా కళ్లకు మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దూదిపై బాదం నూనెను వేసి.. కంటి డార్క్ సర్కిల్స్ దగ్గర మర్దన చేయాలి. ఇలా చేసేటప్పుడు కంటిలో బాదం నూనె పడితే కళ్లు మండుతాయని గుర్తుంచుకోండి. కాబట్టి జాగ్రత్త వహించాలి. తర్వాతి రోజు ఉదయాన్నే నీళ్లతో కడుక్కోవాలి. ఇదే పద్ధతిని రోజ్ వాటర్‌తో చేసినా మంచి ఫలితం ఉంటుంది.
గ్రీన్ టీ!
టీ బ్యాగ్స్ కళ్ల నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా సాయపడతాయి. 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన టీ బ్యాగ్స్‌ను కళ్ల మీద 15 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి రిలాక్స్ అవ్వాలి.
టొమాటొ రసం
టొమాటో చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే కంటి కింద డార్క్ సర్కిల్స్ తీసేయడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. కొంచెం టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమక్రమంగా తగ్గుతాయి. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేయాలి.
కలబంద జెల్తో మసాజ్
కలబంద జెల్తో కళ్ల కింద బాగా మర్దన చేసుకోవాలి. అలా 5 నుంచి 7 నిమిషాల పాటు మసాజ్ చేస్తే కళ్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కాసేపటి తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.