Thursday, November 21, 2024

జూనియ‌ర్‌కు టైమొచ్చింది!

Must Read

రాజ‌కీయాల్లోకి నంద‌మూరి మూడో త‌రం

ఎన్టీఆర్‌ను రంగంలోకి దించేందుకు క‌స‌ర‌త్తు

ఉగాదికి ముహూర్తం ఫీక్స్‌!

నందమూరి ఫ్యామిలీలో మూడో త‌రం రాజ‌కీయాల్లోకి రాబోతుందా?. ఇన్నాళ్లు సినిమాల్లో రాణించిన హీరోలు ఇప్పుడు పాలిటిక్స్‌లోకి అర‌గ్రేటం చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నంద‌మూరి వంశంలో ఎంత మంది హీరోలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు. కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుని… తెలుగు ప్రేక్షకులు అందరూ తాతను మనవడిలో చూసుకునే విధంగా నటనతో ఆకట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తాత పోలికలు కలిగి ఉన్నాడు. తాత సీనియర్ ఎన్టీఆర్ చరిస్మా పుట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ ముఖ కవళికలు.. నటన గాని అచ్చం తాత ని పోలి ఉంటుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరేట్ గా మారిపోయాడు. అటు సీనియర్ ఎన్టీఆర్ కూడా మనవడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ.

అంతేకాకుండా తాత దూరమైనా అదే పేరుతో మరో నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండడంతో ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ ను మరింత ఆరాధిస్తున్నారు. తాతగారి ఛరిష్మాతో పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన పోలికలను కలిగి ఉండటం… ఆయన పేరు పెట్టుకోవడం కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలో ఎప్పుడు స్పెషల్ గా ఉండేలా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవ‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు బాగా వినిపిస్తోంది. అటు అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు జూనియ‌ర్ పేరు ప్ర‌స్తావిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి ఇప్పుడు మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ అవ‌స‌రం వ‌చ్చి ప‌డింది. ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉంటున్న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సయోద్యకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవ‌ల నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని పిలుపునిచ్చారు.

పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడి తర్వాతి స్థానం నారా లోకేష్‌దే అనే పరిస్థితి వచ్చింది. బాలకృష్ణ షూటింగులో బిజీగా ఉండడంతో నారా లోకేష్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇదే సమయంలో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకున్నా.. వార్త‌ల్లో మాత్రం ఎప్పుడూ నిలుస్తూ వస్తున్నారు. రెండ్రోజులకోసారి ఎవరో ఒకరు ఆయన పేరును ప్రస్తావిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు, ఆప్తులు వల్లభనేని వంశీ, కొడాలి నాని అయితే రోజుకోక సారైనా జూనియర్ ప్రస్తావన తెస్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దే.. ఆయనే నిజమైన వారసుడు.. జూనియర్ వస్తేనే టీడీపీకి మళ్లీ పాతరోజులు వస్తాయి.. నందమూరి ఫ్యామిలీని నారా ఫ్యామిలీ కంట్రోల్ చేస్తోంది.. ఎన్టీఆర్ వస్తే లోకేష్‌కు పోటీ అవుతారనే రానివ్వట్లేద‌ని వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆరోపిస్తుంటారు.

2009 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కోసం కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే ఎన్నికలకు మరికొద్ది రోజులు ఉందని ఉగాది పండుగ ఇంట్లో జరుపుకునేందుకు వెళుతుండగా జూనియర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో బెడ్‌కే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సైతం ఆహ్వానించారు. ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపు వస్తే చాలు వచ్చేస్తానని కూడా క్లియర్ కట్‌గానే చెప్పారు.

ఇటీవ‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్ బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. ఆ మధ్య కేంద్రమంత్రి అమిత్ షాతో జూనియర్ భేటీ కావడంతో ఆయ‌న బీజేపీలోకి వెళ్తున్నార‌న్న వార్తలు వచ్చాయి. కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన సంద‌ర్భ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు కూడా చేశారు. యువగళం పాదయాత్రలో అయితే నిత్యం ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది.

ఎన్నిక‌ల‌కు ఏడాది టైం ఉండ‌టంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించాల‌ని అటు బీజేపీ, ఇటు టీడీపీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. ఈ ఉగాదికి జూనియ‌ర్ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్ని శ్రీ‌నివాస‌రావు వైఎస్ఆర్‌సీపీలో ఉంటున్నారు. ఆయ‌న కూడా అల్లుడితో మాట్లాడుతున్నార‌ని స‌మాచారం. అయితే ఎన్టీఆర్ ఏ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఎన్టీఆర్ అభిమానులైతే జూనియ‌ర్‌కు టైమొచ్చిందంటూ సంబ‌రాలు చేసుకుంటున్నారు. మరి జూనియర్ మనసులో ఏముందో..? ఆచితూచి అడుగులేస్తారా..? లేకుంటే ఇంకా రావాల్సిన వ్యక్తుల నుంచి పిలుపుకోసం వేచి చూస్తున్నారా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదేమో.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -